ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్‌ చేయాలి

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

డీసీసీ అధ్యక్షుడు కే నగేష్‌రెడ్డి

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): అసెంబ్లీ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని, ఆయనను వెంటనే బర్తరఫ్‌ చేయాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. డిచ్‌పల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు నల్ల టీ షర్ట్‌లు ధరించి వాటి పైన అభ్యంతరకర స్లోగన్స్‌ రాసుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు యత్నించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మహిళల ముందే టీ షర్ట్స్‌ విప్పి పోలీసుల పైకి విసిరి అసభ్యకరంగా ప్రవర్తించారని, సోమవారం నాటి ఘటన తెలంగాణకు చీకటి రోజని పేర్కొన్నారు. ప్రతిపక్షనాయకుడి హోదాలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ ఏ ఒక్క రోజు కుడా అసెంబ్లీకి రాలేదని, ఆయనపై సుమారు రూ.22 కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని, దీనికి బీఆర్‌ఎస్‌ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ వెయ్యి రోజు ల పాలనలో ప్రజల కోసం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్పినట్లు ప్రతిపక్ష నాయ కులు అనవసర విమర్శలు, రాద్ధాంతం చేయడం మాని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని హితవు పలికారు. ప్రభుత్వం ఏవైనా తప్పులుచేస్తే సరైన సూచనలివ్వాలని.. స్వీకరిస్తామన్నారు.

టీపీసీసీ చీఫ్‌దే ఘనత..

జిల్లాకు నాలుగు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు, తెయూలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ కళాశాల తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు దక్కుతుందన్నారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు బాల్‌రాజ్‌, జిల్లా నాయకులు గాంధారి గోపి, ఎస్టీసెల్‌ అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి బున్నె రవీందర్‌, జిల్లా కార్యదర్శి గణేశ్‌, సొసైటీ చైర్మన్‌ గ్యానాజి గంగారెడ్డి, సర్పంచ్‌ సూదం శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ చిన్నోల్ల శ్రీనివాస్‌, మధు, అశోక్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement