● విజిలెన్స్ దాడులు ఆపాలి
● రైస్‌మిల్లర్స్ అసోసియేషన్
ప్రతినిధుల డిమాండ్
సుభాష్‌నగర్ : ప్రభుత్వం రైస్‌మిల్లుల్లో టెస్ట్ మిల్లింగ్ చేసి ఎంత ఔటర్న్ వస్తే అంతే తీసుకోవాలని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మోటూరి దయానంద్ గుప్తా, కాపర్తి శ్రవణ్, వడ్డి మోహన్‌రెడ్డి, ధన్‌పాల్ దత్తాద్రి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్‌లోగ ఉన్న రైస్‌భవన్‌లో రైస్‌మిల్లర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రైస్‌మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. అంతకుముందు పలు తీర్మానాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైస్‌మిల్లర్లకు 2016 నుంచి రావాల్సిన మిల్లింగ్ చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే మిల్లింగ్ చార్జీని రూ.150కి పెంచాలని కోరారు. సీఎంఆర్ కింద క్వింటాల్‌కు ఇవ్వాల్సిన ఔటర్న్ 67 కిలోల బియ్యంతో రైస్‌మిల్లర్‌కు తీవ్ర నష్టం జరుగుతోందని వాపోయారు. గతంలో జరిపిన టెస్ట్ మిల్లింగ్ రిపోర్టులను బహిర్గతం ఎందుకు చేయడం లేదో చెప్పాలన్నారు. తప్పనిసరిగా టెస్ట్ మిల్లింగ్ చేసి ఎంత ఔటర్న్ వస్తుందో అంతే ఇస్తామని స్పష్టం చేశారు. ఔటర్న్ నిష్పత్తిని ఖరీఫ్, రబీ పంటలకు వేర్వేరుగా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులను వెంటనే నిలిపేయాలని, మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ఎఫ్‌సీఐ కఠినమైన నిబంధనలను కొంతమేర సడలించాలని, ఖరీఫ్ ధాన్యాన్ని పూర్తిగా రా రైస్‌గా, రబీ ధాన్యాన్ని పూర్తిగా బాయిల్డ్ రైస్‌గా మాత్రమే స్వీకరించాలన్నారు. 2022–23 రబీ టెండర్ ధాన్యం ధరను న్యాయబద్ధంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మిల్లర్లను ఇబ్బందులకు గురి చేయొద్దని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. త్వరలోనే సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. బుధవారం నుంచి రైస్‌మిల్లులను బంద్ చేస్తున్నామని, మిల్లర్ల సమస్యలు పరిష్కరించే వరకూ బంద్, నిరసనలను కొనసాగిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లాలోని 340 మంది రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.


