గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

డీజేలపై నిషేధం అమలు

అదనపు కలెక్టర్‌ భుజంగరావు,

సీపీ సాయిచైతన్య

నిజామాబాద్‌ అర్బన్‌: గణేష్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని అదనపు కలెక్టర్‌ భుజంగరావు, పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌లో మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 8 అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలను మాత్రమే బాసర గోదావరిలో నిమజ్జనానికి అనుమతిస్తామని, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ఉమ్మెడ వద్ద నిమజ్జనం చేయాలని సూచించారు. మండపాల వద్ద డీజే సౌండ్లను నిషేదించామన్నారు. మండపాల వద్ద లేదా సోషల్‌ మీడియాలో ఇతరులను కించపరిచేలా, అసభ్యకరంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల పోస్టింగ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిమజ్జన వేళ గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రేన్‌, లైటింగ్‌ వ్యవస్థ, అత్యవసర వైద్యం, అంబులెనన్స్‌, తాగునీరు, బారికేడింగ్‌, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, పారిశుద్ధ్యం వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను అదనపు కలెక్టర్‌ భుజంగరావు ఆదేశించారు. గణేష్‌ ఉత్సవాలు, జెండా బాలాజీ వేడుకల సందర్భంగా నిర్ణీత రోజుల్లో మద్యం విక్రయాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్‌ అధికారులకు సూచించారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని అవగాహన కల్పిస్తూ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు.

మేయర్‌ ఉమారాణి, ట్రెయినీ కలెక్టర్‌ సురేష్‌, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్‌, విజయ కుమారి, ఏసీపీలు ప్రకాష్‌, వెంకటేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, మస్తాన్‌ అలీ, వివిధ శాఖల అధికారులు, గణేష్‌ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement