ఆర్మూర్ : నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు రూపొందించిన ఎత్తిపోతల పథకాల ని ర్మాణాలను పూర్తి చేయించాలని కోరుతూ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌లో మంత్రిని మంగళవారం కలిసి పలు సమస్యలపై చర్చించారు. గుత్ప బ్యాలెన్సింగ్ ట్యాంక్, ఎత్తిపోతల పథకం మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి గుత్ప, మామిడిపల్లి, రామచంద్రాపల్లి, అంకాపూర్, మదన్‌పల్లి, చిన్నాపూర్, ఒడ్యాట్‌పల్లి, అమ్రాద్, జక్రాన్‌పల్లి, అర్గుల్, లక్ష్మాపూర్, మునిపల్లి గ్రామాల పరిధిలోని 2,642 ఎకరాలకు నీటిని అందించాలని కోరారు. అలాగే నియోజకవర్గంలోని నిజాంసాగర్ కాల్వల ఆధునికీకరణ పనుల కోసం మంజూరైన రూ.22 కోట్ల విలువైన పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బినోల, కంఠం, చిక్లీ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.80 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి 5,550 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీటిని అందించాలని కోరారు.
ఈ పథకం ద్వారా బినోల(బోధన్ నియోజకవర్గం) గ్రామ పరిధిలో రెండు వేల ఎకరాలు, కంఠం, చిక్లీ గ్రామాల (ఆర్మూర్ నియోజకవర్గం) పరిధిలోని 3,550 ఎకరాలకు సాగునీరందుతుందని వివరించారు. అదేవిధంగా ఆర్మూర్ నియోజవర్గంలోని పలు పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు.


