అక్షరాస్యతే అభివృద్ధికి తొలిమెట్టు. చదువుతో సమాజంలో చైతన్యం వస్తుంది. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. అయితే, జిల్లాలో అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉంది. అక్షరాస్యత పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. రాష్ట్రంలోనే జిల్లా అక్షరాస్యతలో 11వ స్థానంలో ఉంది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ‘ఉల్లాస్’తో అక్షరాస్యుల సంఖ్య పెరుగుతోంది. నేడు అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఖలీల్‌వాడి : జిల్లాలో నిరక్షరాస్యులు 1,32,592 మంది ఉన్నట్లు వయోజన విద్యాశాఖ అధికారు లు చెబుతున్నారు. ఇందులో పురుషులు 33,075 మంది ఉండగా, మహిళలు 99,517 మంది ఉన్నారు. అయితే, 2011 జనాభా లెక్కల ప్రకా రం అక్షరాస్యతలో జిల్లా 11వ స్థానంలో ఉన్నట్లు చెబుతున్నారు. అత్యల్ప అక్షరాస్యత ఉన్న మండలాలుగా ఇందల్వాయి 42.90 శాతం, సిరికొండ 43, మోపాల్ 43.72, రూద్రూర్ 43.88 శాతం ఉన్నాయి. జిల్లాలోని 33 మండలాల్లో 50 శాతం కన్నా ఎక్కువగా అక్షరాస్యులున్నారు. అత్యధికంగా ఉన్న జాబితాలో నిజామాబాద్ నార్త్ 77.33 శాతం, నిజామాబాద్ సౌత్ 79.79, ఆర్మూర్ 69.28, బోధన్ 68.70, నిజామాబాద్ రూరల్ 63.27 శాతం ఉన్నాయి.
ఉల్లాస్‌తో కాస్త మెరుగు..
అక్షరాస్యత పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నవ భారత అక్షరాస్యత కార్యక్రమం(ఉల్లాస్) నిర్వహిస్తున్నాయి. గతేడాది నుంచి జిల్లాలో ఈ కార్యక్రమం అమ లవుతోంది. గ్రామాలు, పట్టణాల్లోని మహిళా సంఘాల సభ్యులతో కాలనీలు, వార్డులలో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాలు నేర్పిస్తున్నారు. అయితే, ఉల్లాస్‌లో భాగంగా ఇటీవల ఎన్‌ఐవోఎస్ పరీక్ష నిర్వహించగా మొత్తం 27,050 మంది హాజరుకాగా 22,740 మంది ఉత్తీర్ణులయ్యారు. 4,310 మంది ఫెయిల్ అయ్యారు. రెండో విడతలో భాగంగా ఈ నెల 20న ఎఫ్‌ఎల్ నెట్ పరీక్షకు 31,702 మంది అభ్యాసకులు హాజరయ్యేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడత పరీక్షకు హాజరుకాని, హాజరై ఉత్తీర్ణత సాధించని అభ్యాసకులతోపాటు మిగిలిన నిరక్షరాస్యులను పరీక్షకు సిద్ధం చేస్తున్నారు. కాగా, ఉల్లాస్ కార్యక్రమం మరో నాలుగేళ్లపాటు కొనసాగనుంది. అప్పటికై నా వందశాతం అక్షరాస్యత గల జిల్లాగా మారాలని ఆశిద్దాం.
జిల్లా అక్షరాస్యత 63.46 శాతం
పురుషుల అక్షరాస్యత 74.08శాతం
మహిళల అక్షరాస్యత 54.95 శాతం
సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చడమే లక్ష్యం
సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నాం. ఉల్లాస్‌లో భాగంగా మ హిళా సంఘ సభ్యుల ద్వారా నిరక్షరాస్యులకు అ క్షరాలు నేర్పిస్తున్నాం. ఈ నెల 20న ఎన్‌ఐవోఎస్ పరీక్ష జరగనుంది. అక్షరాస్యత పెరిగితే సామాజిక అవగాహన, ఆర్థికాభివృద్ధి, బాల్య వివాహాలు తదితర వాటిని నిర్మూలించవచ్చు.
– పురుషోత్తం, డీడీ, వయోజన విద్యాశాఖ
జిల్లాలో 64.25 శాతం అక్షరాస్యత
రాష్ట్రంలో 11వ స్థానం
నిరక్షరాస్యత నిర్మూలనకు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు
ఆశించినంతరాని ఫలితం
నేడు అక్షరాస్యత దినోత్సవం


