కాంగ్రెస్‌ ప్రభుత్వానిది నిరంకుశ పాలన | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రభుత్వానిది నిరంకుశ పాలన

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం సరికాదు

నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే

బిగాల గణేశ్‌గుప్తా

నిజామాబాద్‌ అర్బన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరంకుశ పాలన చేపడుతోందని నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా బిగాల మాట్లాడుతూ.. నరసాపూర్‌ మాజీ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సరైనది కాదన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్‌ హరీష్‌ రావు, జగదీశ్‌ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలను కిందపడేసి తీవ్రంగా గాయపరచాలని ఆరోపించారు. దాడులకు సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులను అరెస్టు చేసే యత్నం చేయగా, తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యేను నిరసన చేస్తున్న స్థలం నుంచి తీసుకువెళ్లారు. కొద్దిసేపటికి బిగాల గణేష్‌ గుప్తా ప్రజావాణిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి పులాంగ్‌ చౌరస్తాకు వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. హామీల అమలుపై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశామన్నారు. మాజీ మేయర్‌ నీతూకిరణ్‌, ప్రభాకర్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

దాడులు చేయడం సిగ్గుచేటు..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రభుత్వం అడ్డుకుని వారిపై దాడులు చేయించడం సిగ్గుచేటని పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్‌ హామీల అమలులో విఫలం కావడంతోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై దాడులకు నిరసనగా సోమవారం డొంకేశ్వర్‌లో ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈక్రమంలో సీఎం దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్‌ నాయకులు దహనం చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరుగగా బీఆర్‌ఎస్‌ శ్రేణులకు చిక్కిన సగం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement