కొండాపూర్‌లో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

కొండాపూర్‌లో ఉద్రిక్తత

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

గ్రామస్తులకు, బంజారాలకు మధ్య స్థల వివాదం

గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జీ

సిరికొండ: స్థల వివాదం నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థలం కోసం ఆందోళన చేస్తున్న ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. వివరాలు ఇలా.. కొండాపూర్‌ గ్రామంలో చుట్టుపక్కల గల తండాలకు చెందిన బంజారా భవనం ఉంది. అలాగే భవనం ఎదుట ఖాళీ స్థలం ఉండగా, అది మాదంటే మాదని బంజారాలు, గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఈక్రమంలో బంజారా భవనం ఎదుట బంజారాలు ఆదివారం వారి సంప్రదాయ జెండాల చుట్టూ గద్దె నిర్మించడం చేపట్టారు. గద్దె నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. ఆదివారం ఎస్సై రామకృష్ణ సిబ్బందితో వెళ్లి ఘర్షణ తలెత్తకుండా చూశారు. సోమవారం బంజారాలు జెండాల వద్ద పూజలు చేయడంతో మళ్లీ వివాదం తలెత్తింది. విషయం తెలిసిన ఎస్సై రామకృష్ణ సిబ్బందితో అక్కడికి వెళ్లి బంజారాలను అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గ్రామస్తులు ఆందోళన చేయడం మొదలు పెట్టారు. ధర్పల్లి సీఐ భిక్షపతి, ధర్పల్లి, ఇందల్‌వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి ఎస్సైలు సిబ్బందితో గ్రామానికి వెళ్లారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా తగిన చర్యలు చేపట్టారు. గ్రామస్తులు ఒక వైపున, బంజారాలు మరో వైపున రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్తులు రోడ్డుపై టెంట్‌ వేయకుండా పోలీసులు అడ్డుకుంటుండగా వారు ఎంతకీ వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి గ్రామస్తులను చెదరగొట్టారు. అక్కడి నుంచి ఇరు వర్గాలు వెళ్లిపోయిన అనంతరం ముఖ్య నాయకులతో ధర్పల్లి సీఐ భిక్షపతి, తహసీల్దార్‌ రవీందర్‌రావు, ఎంపీడీవో రఫీ అహ్మద్‌, ఎస్సై రామకృష్ణ చర్చలు జరిపారు. వివాదం పెంచుకోవద్దని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. శుక్రవారం సిరికొండ పోలీస్‌ స్టేషన్లో చర్చిద్దామని, ఇరువర్గాల వారు అక్కడికి రావాలని అధికారులు వారికి తెలిపారు. అప్పటి వరకు వివాదాస్పద స్థలం వద్దకు ఎవరు కూడా వెళ్లవద్దని సీఐ తెలిపారు. అందుకు సమ్మతించి ఇరువర్గాల వారు అక్కడి నుండి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement