● ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కీలకం
● కేటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం
నిర్మల్‌టౌన్: పులుల సంరక్షణతోపాటు వాటి ఆవాస ప్రాంతాలను కాపాడడం అందరి బాధ్యతని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, బాసర సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత భవనంలో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ‘ఫారెస్ట్ ప్రొటెక్షనన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ టైగర్ ల్యాండ్‌స్కేప్’ అంశంపై అంతర్ జిల్లా సమన్వయ వర్క్‌షాప్ నిర్వహించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, డీఆర్‌డీఏ, విద్యుత్, పోలీస్ తదితర శాఖల జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు హాజరై, పులుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులుల సంచారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని తెలిపారు. ప్రస్తుతం తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్‌ల నుంచి పులులు ఈ ప్రాంతంలోకి వస్తున్నాయన్నారు. అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం, వన్యప్రాణుల రక్షణ, మానవ–వన్యప్రాణి సంఘర్షణల నివారణకు అన్ని శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు. డీఎఫ్‌వోలు సుశాంత్ సుఖదేవ్ బోబ్డే(నిర్మల్), ప్రశాంత్ పాటిల్(నిజామాబాద్), రాహుల్ జాదవ్(మంచిర్యాల), నీరజ్ టెబ్రివాల్ (కామారెడ్డి), రవిప్రసాద్(జగిత్యాల), పీడీ డీఆర్‌డీఏ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


