బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దివ్యాంగులతో పాటు చేయూత లబ్ధిదారుల నెలసరి పెన్షన్లను పెంచుతూ ప్రకటన చేయాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వేదిక రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.అసెంబ్లీలో పెన్షన్ల పెంపుదల ప్రకటన చేయకుంటే జిల్లాలో ఎమ్మెల్యే,మంత్రులను అడ్డుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో దివ్యాంగులకు ఒరిగిందేమి లేదని పేర్కొన్నారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తేదీని ప్రకటించాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్‌తో ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి చేపడుతామని వెల్లడించారు. వేదిక రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు యేశాల గంగాధర్, బస్వరాజు పాటిల్, ఉపేందర్, బాలేశ్వర్, యశోద, ఆరిఫా, గైని రాములు, నజీర్, సాయమ్మ, గోపాల్, హన్మాండ్లు పాల్గొన్నారు.


