భిక్కనూరు: వ్యవసాయ పొలాల్లోని బోరు మోటర్ కేబుల్ వైర్లను దొంగిలిస్తున్న నలుగురు ముఠా సభ్యులను శనివారం భిక్కనూరు పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో ఎస్.అనిల్ వెల్లడించారు. అంతంపల్లి గ్రామానికి చెందిన రైతు జీడి భీమయ్య పొలంలోని గదికి ఉన్న తాళాన్ని పగులగొట్టిన దుండగులు బోరు మోటర్ స్టార్టర్, కేబుల్ వైర్లను అపహరించారు. చుట్టుపక్కల పొలాల్లోనూ కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధిత రైతు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో, భిక్కనూర్ సీఐ నరేశ్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. భిక్కనూరు బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా కేబుల్ వైర్ల చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారన్నారు. నిందితులను బోరెడ్డి నరేందర్ రెడ్డి (లింగాయపల్లి), మోహన్(కామారెడ్డి) అలియాస్ బైరాం మోహన్ అలియాస్ రాజు, అండాసి శ్రీకాంత్ (కామారెడ్డి), బంటు రామ్ చరణ్ (చిన్నమల్లారెడ్డి)గా గుర్తించారు. అయితే, వీరంతా కల్లు కాంపౌండ్‌లో ఒకరికొకరు పరిచమై, డబ్బుల కోసం వైర్ల చోరీకి పాల్పడుతున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. రాత్రివేళ బోరు మోటర్ కేబుల్ వైర్లను కట్ చేసి, వాటిని కాల్చి రాగి తీగలను వేరు చేసి స్క్రాప్ షాపుల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రాగి తీగలు, కేబుల్ కట్టర్లు, ఇనుప రాడ్ సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీసీఎస్ కామారెడ్డి, భిక్కనూరు పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.


