● సొసైటీ వద్ద రైతుల ఆందోళన
డిచ్‌పల్లి: ఆన్‌లైన్‌లో స్టాక్ పెట్టిన రెండు నిమిషాల్లోనే 460 బస్తాల యూరియా బుకింగ్ పూర్తికావడం, గంట నుంచి అక్కడే ఉన్న వారికి ఒక్క బస్తా యూరియా దక్కకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ)కి శనివారం 460 యూరియా బస్తాలు వచ్చాయి. సొసైటీ చైర్మన్ బోధునపు నవీన్, సిబ్బంది ఈ విషయాన్ని రైతులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులలో పె ట్టి ఉదయం 10 గంటలకు బుకింగ్ యాప్‌లో స్టాక్ అందుబాటులో ఉంటుందని, రైతులు బుక్ చేసుకోవాలని సూచించారు. దీంతో లారీ నుంచి యూరి యా అన్‌లోడ్ చేయడానికి ముందే సొసైటీ పరిధిలోని రైతులు అక్కడికి చేరుకున్నారు. 10 గంటల కు యాప్‌లో బుకింగ్ మొదలైన వెంటనే రైతులు తమ ఫోన్లలో యూరియా బుక్ చేసుకునేందుకు యత్నించారు. అయితే, కేవలం రెండు నిమిషాల్లోనే 460 యూరియా బస్తాల బుకింగ్ పూర్తయిపోయినట్లు యాప్‌లో చూయించడంతో అక్కడే ఉన్న రైతు లు అవాక్కయ్యారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. యూరియా బుకింగ్ యాప్ ను రద్దు చేసి, పాత పద్ధతిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ పరిధిలోని రైతులకు మా త్రమే యూరియా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చైర్మన్ నవీన్ మాట్లాడుతూ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో తాము ఏం చేయలేకపోతున్నామన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.


