సర్‌ నోటీసుల జారీలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

సర్‌ నోటీసుల జారీలో జాప్యం

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

ఇప్పటివరకు 58 శాతమే జారీ

నోటీసులకు స్పందించే విషయంలోనూ గందరగోళం

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అసాధారణ (అనామలిస్‌) జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియలోనూ జాప్యం జరుగుతోంది. జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీచేయడం, సంబంధిత ఓటర్లతో హియరింగ్‌ నిర్వహించడం, వారి నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం మరింత ఆలస్యమవుతోంది. ఓటరు వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి నోటీసులు ఇచ్చి హియరింగ్‌ చేపట్టేందుకు వారం రోజుల గడువు ఇస్తుండగా, హియరింగ్‌కు హాజరయ్యేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. నోటీసులు అందుకున్న ఓటర్లు పదో తరగతి, కులం, స్థానికత సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్‌, పట్టా పాస్‌బుక్‌ తదితర 12 రకాల పత్రాలను సమర్పించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో చాలామంది ఓటర్లు పత్రాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.

హియరింగ్‌కు రాక రీ షెడ్యూల్‌

ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 16వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఈ క్రమంలో బీఎల్‌వో ద్వారా నోటీసుల జారీలో జాప్యంతోపాటు హియరింగ్‌ కోసం ఓటర్లు హాజరుకావడం లేదు. దీంతో మరోసారి హియరింగ్‌కు రీ షెడ్యూల్‌ చేయాల్సి వస్తోంది.

పూర్తిభారం బీఎల్‌వోల పైనే

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ సమయంలో బీఎల్‌వోలతో పాటు ప్రభుత్వంలోని ఇతర అధికారులు, సిబ్బందిని ఫారాల పంపిణీకి వినియోగించారు. నోటీసుల జారీ ప్రక్రియను మాత్రం బీఎల్‌వోలకే వదిలేయడంతో ఈ ప్రక్రియలో ఆలస్యమవుతోంది. యాప్‌లో నోటీసుతో పాటు ఓటరు సమర్పించే పత్రాలు, హియరింగ్‌కు హాజరైన ఓటరు ఫొటోలను మూడు విడతలుగా బీఎల్‌వోలే అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. పదేపదే నిబంధనలు మారుతుండటం, నోటీసులు వచ్చిన ఓటర్లు ఎన్ని ధృవపత్రాలు సమర్పించాలన్న విషయంలో ఓటర్లతో పాటు బీఎల్‌వోల్లోనూ గందరగోళం నెలకొంది.

మూడోస్థానంలో జిల్లా..

రాష్ట్రంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల త ర్వాత అనామలిస్‌ జాబితాలో ఎక్కువ మంది ఉంది నిజామాబాద్‌ జిల్లాలోనే. ఇక్కడ 4,32,405 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు 2,50,058 మందికి నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇంకా 1,82,347 మందికి నోటీసులు అందాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు 45,019 మంది మాత్రమే హియరింగ్‌కు హాజరయ్యారు. ఇప్పటికే 1,16,325 మందికి కేటాయించిన హియరింగ్‌ డేట్‌ ముగిసింది. వీరిలో 17 మందికి మాత్రమే రీషెడ్యూల్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement