ఆర్మూర్: పండుగ అనేది ప్రజలందరినీ ఐక్యం చేసే కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ పరస్పరం సహరించుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని సీపీ సాయిచైతన్య సూచించారు. వినాయక నవరాత్రుల నేపథ్యంలో పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో శనివారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ.. ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై శాంతి కమిటీ సభ్యులు, గణేశ్ ఉత్సవాల నిర్వాహకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. గణేశ్ మండపాలు ఏర్పాటు చేసే వారు ముందస్తుగా పోలీసు శాఖ అనుమతులు తీసుకోవడంతోపాటు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మండపాల వద్ద డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన శబ్ధ పరిమితులు, సమయ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకొని ముందుగా నిర్ణయించిన మార్గాలు, సమయాన్ని పాటించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి , ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్, రూరల్ సీఐ జాన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరిరఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్‌రెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, మెండోర ఎస్సైలు రజనీకాంత్, శైలందర్, సుహాసిని పాల్గొన్నారు.
శాంతియుత వాతావరణంలో
గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలి
పోలీసులకు సహకరించాలి
శాంతి కమిటీ సమావేశంలో
సీపీ సాయిచైతన్య


