● డీసీసీ మాజీ అధ్యక్షుడు
మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ రూరల్: ఉనికి కోసమే బీఆర్‌ఎస్ నాయకులు ఆరాటపడుతున్నారని డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సంక్షేమంపై సమష్టిగా, మరింత నిబద్ధతతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసిన వాగ్ధానాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే 2023లో మాదిరిగానే 2028 జరిగే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, కార్పొరేటర్ మనోహర్ పాల్గొన్నారు.


