● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
● మోర్తాడ్‌లో వంటావార్పుతో నిరసన
కమ్మర్‌పల్లి(మోర్తాడ్): ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను ప్రకటించి, అధికారంలోకి వచ్చాక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ కార్డులతో నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మోర్తాడ్‌లో వంటా–వార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మహిళలతో కలిసి కూరగాయలు కోయడంతోపాటు, బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 చొప్పున నేటికీ రూ. 82,500, రూ. 4వేలకు పెంచుతామన్న చేయూత పింఛన్ డబ్బులు రూ. 66వేలు, దివ్యాంగులకు రూ. 66వేలు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. అదేవిధంగా సిలిండర్ బాకీ రూ. 16,500, నియోజకవర్గంలో 5వేల మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం బాకీ పడ్డారన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు బాకీ ఉన్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర బడ్జెట్, అప్పుల స్థితిగతులపై అవగాహన ఉందని వీడియోల్లో స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు.. ఇప్పుడు అధికారం చేపట్టాక కేసీఆర్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై నాటి వీడియోలను ప్రదర్శించి, ప్రజల సాక్షిగా పాలకుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. అనంతరం ప్రజలకు బాకీ పడ్డ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లతో పోస్టర్లను విడుదల చేశారు.
నగరంలో..
నిజామాబాద్ అర్బన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని డిమాండ్ చేస్తూ నగరంలో బీఆర్‌ఎస్ శ్రేణులు శుక్రవారం ధర్నా చౌక్‌లో వంటా–వార్పు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మేయర్ నీతూకిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. నాయకులు ప్రభాకర్‌రెడ్డి, విశాలినిరెడ్డి మంజుల పాల్గొన్నారు.


