మలిసంధ్యలో మనోధైర్యం
● నిస్సహాయ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న కేదారానంద
● ఆధ్యాత్మిక చింతనతోపాటు
ఆలన.. పాలన
నందిపేట్(ఆర్మూర్): నా అనే వారు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తోంది నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమం. ప్రత్యేకంగా వృద్ధాశ్రమాన్ని నెలకొల్పిన ఆశ్ర మ పీఠాధిపతి కేదారానందస్వామిజీ దిక్కుమొక్కులేని వారి వృద్ధులను అక్కున చేర్చుకుంటున్నారు. బిక్కుబిక్కుమంటూ వస్తున్న వృద్ధుల్లో మనోధైర్యాన్ని నింపుతూ ఆధ్యాత్మిక చింతనలో లీనం చేస్తున్నారు. కన్న కొడుకులా ఆలనాపాలనా చూసుకుంటున్నారు. ఏ దిక్కు లేని వృద్ధులకు ఆశ్ర యం కల్పించాలని సంకల్పించి 20 ఏళ్ల క్రితం కేదారానంద స్వామి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయా లని సంకల్పించారు. ఆలోచన వచ్చిందే తడువుగా ఆచరణలో పెట్టారు. ప్రస్తుతం 25 మందికి ఆశ్ర యం కల్పిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మ ధ్యాహ్నం భోజనం, సాయంత్రం తేనీరు, రాత్రి భోజనం ఇలా రోజూ పౌష్టికాహారం అందిస్తున్నారు. నిద్రించేందుకు సౌకర్యవంతమైన బెడ్లు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన దుస్తులు ఇస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఒక వైద్యుడిని ప్రత్యేకంగా నియమించారు.
ఆశ్రయం పొందుతూనే ఆధ్యాత్మిక సేవ
కేదారేశ్వర వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారు ఆధ్యాత్మిక సేవలో ముందుంటున్నారు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు తమ వంతు సేవలు అందిస్తున్నారు. నిత్యాన్నదానంలో పాలు పంచుకోవడంతోపాటు లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తూ, దేవతా మూర్తులకు ప్రతి నిత్యం అవసరమయ్యే పూలమాలలు అల్లుతూ తరిస్తున్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే ఆశ్రమ కమిటీ సభ్యులకు తెలిపి సమస్యను పరిష్కరించుకుంటున్నారు.


