● 10.8 తులాల బంగారు నగలు స్వాధీనం
నందిపేట్ (ఆర్మూర్): నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన దొంగత నం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంతర్రాష్ట్ర నేరస్తుడిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి శనివారం నందిపేట పోలీస్ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన నందిపేటలోని గాంధీ మెడికల్ యజమాని ఇంటి తాళాలను పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు నగలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించడంతోపాటు అనుమానిత నేరస్తుల పై నిఘా సారించారు. మహారాష్ట్రకు చెందిన పాత నేరస్తుడు షేక్ ఖయ్యూమ్ రఫీక్ బేగ్ దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు శనివారం నిజామాబాద్ వైపు వెళ్తుండగా నవీపేట్ రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నారు. అతడిని విచారించగా.. నందిపేటలో చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి పది తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహారాష్ట్రలోని కొత్వాలీ, కర్నాటక రాష్ట్రంలోని బీదర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2023లో కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడి నుంచి అక్కడి పోలీసులు 4 పిస్టల్స్ రికవరీ చేశారు. నిందితుడిని పట్టుకున్న సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై వినయ్, హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుల్‌లు అనిల్, శ్రీనివాస్, షబ్బీర్, మహిపాల్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.


