నోటీసుల పంపిణీని వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

నోటీసుల పంపిణీని వేగవంతం చేయాలి

Aug 30 2026 1:33 AM | Updated on Aug 30 2026 1:33 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా హియరింగ్‌ నోటీసుల పంపిణీనీ వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియపై శనివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెనన్స్‌ ద్వారా ఎస్‌ఐఆర్‌పై సమీక్షించారు. మ్యాపింగ్‌ కాని, అనామలీస్‌ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల పంపిణీ, హియరింగ్‌ అంశాలపై పలు సూచనలు చేశారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం తీసుకుని ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. తప్పిదాలకు అవకాశం లేకుండా, పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు ఈఆర్‌వోలు, సహాయ ఈఆర్‌వోలు బూత్‌ లెవెల్‌ అధికారులకు దిశా నిర్దేశం చేయాలన్నారు.

కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో హియరింగ్‌ కోసం 4,32,401 నోటీసులు సిద్ధం చేయగా, ఇప్పటికే 56,678 మందికి నోటీసులు అందజేశామన్నారు. ఈఆర్‌వోలు, సహాయ ఈఆర్‌వోలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, హియరింగ్‌ ప్రక్రియను నిర్ణీత గడువు లోగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. వీసీ అనంతరం జిల్లా అధికారులకు కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్‌ భుజంగరావు, నగర పాల క సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ఏవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

వేగవంతంగా

గోదావరి పుష్కర పనులు

నిజామాబాద్‌ అర్బన్‌: గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా, పుష్కర ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు సూచించారు. కలెక్టర్‌తోపాటు దేవాదాయశాఖ అధికారులతో వారు శనివారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఇప్పటికే ఆమోదం పొందిన పనులను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి తక్షణమే ప్రారంభించాలని అన్నారు. ఈ పనుల పర్యవేక్షణ కోసం తగిన అనుభవం కలిగిన సీనియర్‌ అధికారిని స్పెషల్‌ ఆఫీసర్‌ గా నియమించాలని అన్నారు. భూసేకరణ అవసరమైన పక్షంలో వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వారం వారం పనుల ప్రగతిని సమీక్షిస్తూ, నివేదికలు సమర్పించాలని సూచించారు. కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, అదనపు కలెక్టర్‌ భుజంగరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement