ఆర్మూర్: వర్షాలు సరిగా లేకున్నా భూగర్భ జలాలపై ఆధారపడి ఖరీఫ్‌లో పంటలు పండిద్దామని నడుం బిగించిన జిల్లాలోని పట్టణ ప్రాంత రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్‌లు కష్టాలను తెచ్చి పెట్టాయి. వ్యవసాయం పనుల్లో బిజీగా ఉండాల్సిన రైతులు రోడ్లెక్కి నిరసన తెలుపుతూ ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతులు ఇస్తున్నారు. యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం మొదట ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్‌తోనే రైతులు ఇక్కట్లు పడుతుండగానే కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్’ను ప్రవేశపెట్టింది. ఈ నెల 6వ తేదీన కొత్త యాప్ అమలులోకి రాగా, నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పట్టణాల పరిధిలోని రైతుల రిజిస్ట్రేషన్ కావడం లేదు. దీంతో వరి, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంటలకు యూరియా దొరకక రైతులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రెండు వేల సర్వే నంబర్లలో ఆరు నుంచి ఏడు వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. అదే విధంగా నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, భీమ్‌గల్ ము న్సిపాలిటీల పరిధిలో సైతం వ్యవసాయ భూమి వేల ఎకరా ల్లో ఉంది. పట్టణ ప్రాంత రైతుల యూరియా కష్టాలపై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. త్వరలో మార్పులు చేస్తామని బుజ్జగిస్తున్నప్పటికీ సమస్య మరో వారం, పది రోజుల వర కు పరిష్కారమయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. సకాలంలో యూరియా వేయకపోతే వరి, మొక్కజొ న్న పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయి రైతులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. యూరియా యాప్‌లతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఆధారంగా ఎకరా నికి రెండు యూరియా బస్తాలను సొసైటీల ద్వారా సరఫరా చేయాలని పట్టణ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డికి వినతి
ఆర్మూర్ పట్టణానికి చెందిన ఆరు పంతల సంఘం రైతులు అంకాపూర్‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డిని ఆదివారం కలిసి సమస్యను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. మంత్రి స్పందిస్తూ యాప్‌లో సాంకేతిక సమస్య ఉన్నందున ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో రైతు నాయకులు కలిగోట గంగాధర్, యామాద్రి భాస్కర్ పటేల్ తదితరులున్నారు.
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌తో మున్సిపాలిటీల పరిధిలో
ఎరువుల బుకింగ్‌కు ఇబ్బందులు
నిజామాబాద్ నగరం, ఆర్మూర్, బోధన్,
భీమ్‌గల్ పట్టణాల్లో అందని యూరియా
నిరసనలు, వినతులతో పంట పొలాలను
వీడి రోడ్లపైకి వస్తున్న రైతులు


