సుభాష్‌నగర్: ఆయూష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను బలోపేతం చేయాలని సీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ(ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ) కమిషనర్ సంగీత సత్యనారాయణ అన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై గురువారం ఆమె జూమ్ మీటింగ్‌లో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలతోపాటు ని జామాబాద్ డీఎంహెచ్‌వో రాజశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాలను నిర్వహిస్తూ శాంపిళ్లను సేకరించి నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలనున్న నేపథ్యంలో సమావేశాలు, సమీక్షలు, జ్వర సర్వే, ఫాగింగ్, యాంటీ లార్వా, తదితర చర్యలు చేపట్టాలని తెలిపారు. జీవనశైలి వ్యాధుల నియంత్రణలో భాగంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలన్నారు. డీటీసీవో దేవి నాగేశ్వరి, ప్రోగ్రాం అధికారులు అశోక్, వెంకన్న, శిఖర, వెంకటేష్, సుప్రియ, శ్రావ్య, తదితరులు పాల్గొన్నారు.


