● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
నందిపేట్(ఆర్మూర్): అక్రమ వెంచర్లు చేపట్టడాన్ని అధికారులు ఉపేక్షించకుండా చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆదేశించారు. గురువారం నందిపేట్ మండల కేంద్రంలో ఇటీవల మంజూరైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం స్థానిక అధికారులతో కలిసి ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్, స్థానిక ఎంపీడీవో, ఎమ్మార్వో, ఇరిగేషన్, పంచాయతీ, జిల్లా క్రీడల అధికారులతో కలిసి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల కేంద్రానికి క్రీడాస్థలం మంజూరైందని, దానికి అనువైన స్థలం పరిశీలించాలని, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం మిగతా భూములు కూడా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం పలువురిని పరామర్శించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు, బీజేపీ మండల అధ్యక్షుడు పటేళ్ల రాజు, నాయకులు పెయింటర్ రాజు, నాగ సురేష్, సాయి, కస్తూరి గంగాధర్, లక్కంపల్లి చిన్నయ్య, చింత శ్రీను, పెట్ల శీను తదితరులు పాల్గొన్నారు.
ఎత్తిపోతల పథక నిర్మాణ పనుల పరిశీలన
మాక్లూర్: గుత్ప ఎత్తిపోతల నుంచి వచ్చే ధర్మోరా చెరువులోని నీటిని ఆధారంగా చేసుకుని రూ.11.71 కోట్లతో లక్మాపూర్ వద్ద చేపట్టిన మినీ లిఫ్ట్ పనులను గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పర్యవేక్షించారు. సంబంధిత నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి వెళ్లి బొంకన్‌పల్లి వద్ద నీటిని ఎత్తిపోసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు నూతుల శ్రీనివాస్‌రెడ్డి, ముల్లంగి(బి) సర్పంచ్ ధర్మపతి, రైతులు ఉన్నారు.


