కమ్మర్‌పల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌లోకి బుధవారం ఉదయం 6 గంటల వరకు 4,051 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. తర్వాత వరద క్రమక్రమంగా తగ్గుతూ సాయంత్రం 6 గంటల వరకు 3,500 క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1,065.40 అడుగుల (16.545 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. గతేడాది 1,075 అడుగుల (32.897 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 220 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు కలిపి మొత్తం 751 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో అవుతోందని అధికారులు తెలిపారు.


