ఆకులకొండూర్‌లో అలుగు పారుతున్న పులాంగ్ వాగు చెక్ డ్యావ్‌ు
జిల్లాపై వరుణుడు కరుణించాడు. రెండు రోజులుగా జోరు వాన కురుస్తోంది. చాలా రోజులుగా ఆకాశానికేసి చూస్తున్న రైతులు.. కురుస్తున్న వర్షంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో పంటలకు జీవం వచ్చింది. వానాకాలం ప్రారంభం నుంచి అడపాదడపా తేలికపాటి, మోస్తరు వర్షాలే కురిశాయి. అయితే, మంగళవారం సాయంత్రం మొదలైన భారీ వర్షం బుధవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో చెరువులు, వాగులకు వరద ప్రవాహం మొదలైంది. పలుచోట్ల చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలోనే అత్యధికంగా మాక్లూర్ మండలం మదన్‌పల్లిలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెండోరా, మోపాల్, నవీపేట్, మోస్రా, డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల్లో 100 మి.మీ మించి వర్షపాతం నమోదైంది. భీమ్‌గల్, నందిపేట, కోటగిరి మండలాలు మినహా అన్ని మండలాల్లోనూ 50 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం వరకు జిల్లాలో సరాసరి సగటు వర్షపాతం 79.69 మిల్లీమీటర్లుగా నమోదైంది. దీంతో జిల్లావ్యాప్తంగా సాగులో ఉన్న వరి, పత్తి, పసుపు, సోయా, మొక్కజొన్న తదితర పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. నిజామాబాద్ నగర శివారులోని ఆకుల కొండూర్, నగరంలోని పాంగ్రా వాగులు అలుగు పోస్తున్నాయి. కోటగిరి మండలం యాద్గార్‌పూర్ చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు ప్రవహించింది. లింగంపల్లి–బోధన్ రహదారిపై వంతెన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిరికొండ మండలంలోని కొండూర్ కప్పలవాగు వంతెన వద్ద తాత్కాలిక మట్టి రోడ్డు కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఏకధాటిగా కురిసిన వర్షంతో నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చంద్రశేఖర్ కాలనీ, నాగారాం, మాలపల్లి, అర్సపల్లి, గౌతంనగర్, ముబారక్‌నగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. డ్రెయినేజీలు ఉప్పొంగాయి.
కరుణించిన వరుణుడు
మాక్లూర్ మండలంలో
అత్యధికంగా 116 మిల్లీమీటర్ల వర్షం
భారీ వర్షంతో వాగులు,
చెరువులకు జలకళ
పంటలకు జీవం పోసిందంటూ
రైతుల హర్షం
33 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు


