● అదనపు కలెక్టర్ భుజంగరావు
● ఆపద మిత్ర వలంటీర్లకు కిట్లు పంపిణీ
నిజామాబాద్ అర్బన్ : విపత్తు సమయాల్లో ఆపదమిత్ర వలంటీర్లు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం ఆపదమిత్ర వలంటీర్లకు కిట్లు పంపిణీ చేశారు. విపత్తు సమయాలలో కిట్‌ను ఎలా ఉపయోగించాలనే విషయాలపై ఎస్‌డీఆర్‌ఎఫ్ అధి కారులు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ విపత్తులను నిలువరించే శక్తి ఎవరికీ ఉండదని, ముందస్తు సన్నద్ధతతో ప్రాణ, ఆస్తి నష్టాల్ని చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలని సూచించారు. ఆపదలో ప్రజలకు సహాయకారులుగా నిలవాలని ఉద్బోధించా రు. జిల్లా రెవెన్యూ అధికారి గీత మాట్లాడుతూ ఆప ద సమయాలలో ప్రజలకు సహాయపడే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావించాలని అన్నారు. ఆపదమిత్ర నోడల్ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సాయన్న, కలెక్టరేట్ డీ–సెక్షన్ పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ, 7వ పోలీసు బెటాలియన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


