నిరుపయోగంగా హాస్టల్‌ భవనం | - | Sakshi
Sakshi News home page

నిరుపయోగంగా హాస్టల్‌ భవనం

Jul 13 2026 1:40 AM | Updated on Jul 13 2026 1:40 AM

ఏదైనా ప్రభుత్వ శాఖకు కేటాయిస్తాం..

కాలేజ్‌ కోసం వినియోగించాలి..

కమ్మర్‌పల్లిలో 2015లో ఎస్సీ బాలుర వసతి గృహం ఏర్పాటు

3 ఏళ్లు వాడకం.. 8ఏళ్లుగా ఖాళీ

పట్టించుకోని అధికారులు

కమ్మర్‌పల్లి: లేనిచోట లేక ఏడిస్తే, ఉన్నచోట ఉండి ఏడుస్తున్నా చందంగా మారింది మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్‌ హాస్టల్‌ భవనం పరిస్థితి. ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో భవనంలోని తలుపులు, కిటికీలు వాటికి సంబంధించిన ఫేమ్‌లు చోరీకి గురయ్యాయి. భద్రత, రక్షణ లేక పశువులు, పాములు, తేళ్లు, ఇతర జీవాలకు ఆవాసంగా మారింది.

గురుకులం మంజూరుతో హాస్టల్‌ తరలింపు..

2015 సెప్టంబర్‌లో మండలంలోని మానాల గ్రామానికి తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌(గర్‌ల్స్‌)(టీటీడబ్ల్యూఆర్‌ఎస్‌(జీ)) మంజూరైంది. రూ. 5.20 కోట్లు కేటాయిస్తూ 2016–17 విద్యా సంవత్సరం నుంచి బోధన తరగతులు ప్రారంభించాలని జీవో జారీ చేశారు. దీంతో కమ్మర్‌పల్లి ఎస్సీ బాయ్స్‌ హాస్టల్‌ను చౌట్‌పల్లిలోని ఎస్సీ హాస్టల్‌లో విలీనం చేసి, హాస్టల్‌ భవనంలో తాత్కలికంగా పాఠశాల తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలను ఇదే భవనంలో ఏర్పాటు చేశారు. 2016లో చేపట్టిన జిల్లాల పునర్విభజనతో ‘మానాల’ గ్రామాన్ని నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఏర్పడిన రుద్రంగి మండలంలో కలిపారు. మానాల గ్రామం పేరిట ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాకే కేటాయించింది. అయినప్పటికీ పాఠశాలను మానాల చిరునామాగా 2018 జూలై నెలాఖరు వరకు రెండున్నరేళ్ల పాటు కమ్మర్‌పల్లిలోని ఇదే భవనంలో కొనసాగించారు. అనంతరం ఉన్నతాధికారులు పాఠశాలను హుటాహుటిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు తరలించారు. దీంతో అప్పటి నుంచి హాస్టల్‌ భవనం ఖాళీగా ఉంటోంది.

దర్వాజలు, కిటికీలు చోరీ...

హాస్టల్‌ భవనంలో 10 గదులు ఉండగా, వెనక వైపు ప్రహరీ లేదు. దీంతో కలపతో చేసిన తలుపులు, దర్వాజలు, ఇనుముతో చేసిన కిటికీలు, ఫేమ్‌లను దుండగులు ఎత్తుకెళ్లారు. భవనంలో ఫ్లోరింగ్‌ ధ్వంసం అయింది. బాత్‌రూం, మరుగుదొడ్ల గదులకు సంబంధించిన గోడలను ధ్వంసం చేసి తలుపులు ఎత్తుకెళ్లారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉండడంతో ప్రజాధనం వృథా అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నచిన్న మరమ్మతులు చేపట్టి భవనాన్ని ఏదైనా ప్రభుత్వ కార్యాలయం కోసం వినియోగించాలని పలువురు కోరుతున్నారు.

రూ.80లక్షల నిధులతో..

కమ్మర్‌పల్లిలో ఎస్సీ బాయ్స్‌ హాస్టల్‌కు సొంత భవనం లేకపోవడంతో 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సొంత భవనం నిర్మాణం కోసం రూ. 80లక్షలు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పోలీస్‌ స్టేషన్‌ పక్కన ప్రభుత్వ కార్యాలయాల స్థలంలో 10 గదులతో కూడిన భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణం పూర్తి కాగా, అద్దె భవనంలో కొనసాగుతున్న బాయ్స్‌ హాస్టల్‌ను 2015 విద్యా సంవత్సరంలో నూతన భవనంలోకి మార్చారు.

కమ్మర్‌పల్లిలోని ఎస్సీ హాస్టల్‌ భవనం నిరుపయోగంగా ఉందని మా దృష్టిలో ఉంది. ఏదైనా ప్రభుత్వ శాఖ అడిగితే భవనం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి, ఖాళీ భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతాం.

–రజిత, జిల్లా షెడ్యూల్‌ కులాల

అభివృద్ధి శాఖ అధికారి, నిజామాబాద్‌

కమ్మర్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో హైస్కూల్‌తోపాటు, ప్రైమరీ, జూనియర్‌ కాలేజ్‌ నడుస్తున్నాయి. ఈమూడు కొనసాగుతుండటంతో స్థలం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలేజ్‌ను నిరుపయోగంగా ఉన్న ఎస్సీ హాస్టల్‌ భవనంలోకి మారిస్తే భవనం వినియోగంలోకి వస్తుంది.

–మైలారం సుధాకర్‌, మాజీ ఎంపీటీసీ, కమ్మర్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement