డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా పశువైద్య శాఖ ఇన్‌చా ర్జుల పాలనలో కొట్టుమిట్టాడుతోంది. శాఖకు పూర్తి స్థాయి జిల్లా అధికారి (జేడీ) లేకపోవడంతో పాలన గాడి తప్పుతోంది. ఏడాది కాలంగా రెగ్యులర్ బాస్ లేకపోవడంతో తాత్కాలిక అధికారులతో శాఖను నెట్టుకొస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో జా ప్యం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించడంతో ప్రభు త్వ పథకాల అమలు మందగించింది. విధులకు హాజరయ్యే విషయంలో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ తేడాది జూలైలో రెగ్యులర్ జేడీ జగన్నాథచారి ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వం జిల్లాకు పూర్తి స్థాయి అధికారిని నియమించలేదు. సీనియర్ ఏడీలను ఇన్‌చార్జీలుగా నియమిస్తూ నెట్టుకొస్తున్నారు. ఏడాది కాలంలో ముగ్గురు అధికారులు ఇన్‌చార్జి సీట్లో కూర్చుకున్నారు. ప్రస్తుతం కా ర్యాలయ ఏడీ గంగాధరయ్య జిల్లా అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కార్యాలయమే కాకుండా ఆర్మూర్, భీమ్‌గల్ డివిజన్ స్థాయి పశువైద్య అధికారుల (ఏడీ) పోస్టులు గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా మండల స్థాయిలోనూ పలు కేటగిరీ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. పర్యవేక్షణ లేక పశువులు, గొర్రెలు, మేకలకు సమయానికి వైద్యం, టీకాలు అందడం లేదు. రెగ్యులర్ అధికారి (జేడీ), ఏడీలు ఉంటే పర్యవేక్షణ పెరిగి పరిపాలన, పశువైద్యం సవ్యంగా సాగుతుందని ఆ శాఖ ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు.
పదోన్నతులు లేకనే..
పశు సంవర్ధక శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు, అధికారులకు సమయానికి పదోన్నతులు రాకపోవడంతో ఏళ్ల తరబడి ఒకే పోస్టులో పని చేస్తున్నారు. ఖాళీగా ఉన్న జేడీ పోస్టు ఏడాదైన భర్తీ చేయకపోవడం వెనుక పదోన్నతుల అంశమే కారణంగా నిలుస్తోంది. ఏడీలకు పదోన్నతులు లేక జిల్లా స్థాయి పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. డివిజన్, మండల స్థాయి పోస్టుల భర్తీ కూడా పదోన్నతులపై ఆధారపడి ఉందని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
జిల్లా పశువైద్య శాఖకు రెగ్యులర్ అధికారి కరువు
ఏడాది కాలంగా ఇన్‌చార్జులతోనే
కొనసాగుతున్న పాలన
ఆర్మూర్, భీమ్‌గల్ డివిజన్ పోస్టులూ ఖాళీగానే..


