డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్) : అభివృద్ధికి పాటుపడతారనే నమ్మకంతో గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ, వారికి మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సూచించారు. నూతనంగా ఎన్నికై న నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లకు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. నిజామాబాద్ నగర శివారులోని బోర్గాం(పి)లో ఉన్న భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో కార్పొరేషన్, మున్సిపాలిటీల పాలకవర్గాలకు, అలాగే డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని అమృతాగార్డెన్స్‌లో జిల్లాలోని సర్పంచ్‌లకు అవగాహన కల్పించారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ, ప్రింటెడ్ మెటీరియల్‌ను అందజేశారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని, స మస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారం కోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకో వా లని అన్నారు. అధికారుల నుంచి సరైన సహకారం అందని పక్షంలో తన దృష్టికి తేవాలని, జిల్లా యంత్రాంగం తప్పక సహకరిస్తుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. అధికారాలు, హక్కుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నప్పుడే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతార న్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న వనరుల ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే సదుద్ధేశంతో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని, గ్రామాలు, వార్డుల్లో సమర్థవంతంగా సేవలు అందించాలని హితవు పలికారు. కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా, సొంత నిర్ణయాలతో గౌరవాన్ని పెంపొందించుకోవాలని, ఇది భవిష్యత్‌లో మరెన్నో ఉన్నత పదవులకు ఆస్కారం కల్పిస్తుందన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో అందరిని భాగస్వాములు చేస్తూ, కార్యక్రమం విజయవంతం అయ్యేలా చొరవ చూపాలన్నారు.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచులపై ఉంటుందన్నారు. దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రస్తుతం పటిష్టంగా కొనసాగడానికి ప్రధాన కారణం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమూల మార్పులేనని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల అభివృద్ధికి తాను కృషి చేస్తానని అన్నారు.
నిజామాబాద్ నగర మేయర్ కే.ఉమారాణి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, కార్పొరేటర్లు, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, కౌన్సిర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ దిలీప్‌కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీపీవో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో సాయాగౌడ్, డీఈవో అశోక్, ఏవో రాజబాబు, అధికారులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు ధన్‌పాల్, భూపతిరెడ్డి
అవగాహన సదస్సుల్లో పాల్గొన్న మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు..
స్థానిక వనరుల ద్వారా
ఆదాయాన్ని పెంచుకోండి
ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి
దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి
‘ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సుల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు
ధన్‌పాల్, భూపతిరెడ్డి


