సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ – సిరిసిల్ల – జగిత్యాల జిల్లాల అటవీ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్న పెద్దపులి గురువారం రెండు ఆవులను వేటాడి చంపింది. కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలోని భీమ్‌గల్ మండలం దేవక్కపేట్ అటవీ ప్రాంతంలో బూక్యా చంద్ర, సోమరి మంగ్యాలకు చెందిన ఆవులను హతమార్చింది. నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల మధ్య ఉన్న అటవీ ప్రాంతాల్లోనే పులి చక్కర్లు కొడుతోంది. కొన్ని నెలల కిందట మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మీదుగా వచ్చిన మగ పులి.. జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల మీదుగా భువనగిరి జిల్లా వరకు వెళ్లి మళ్లీ అదే దారిన తిరిగి వచ్చింది. అయితే గత పది రోజులుగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల మధ్య తిరుగుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చేటప్పుడు గోదావరి నది దాటి వచ్చినప్పటికీ మళ్లీ ఆ నది దాటి వెళ్లకుండా ఇక్కడిక్కడే తిరుగుతుండడం గమనార్హం. తోడు కోసం వెతుకుతోందా? లేక వన్యప్రాణులు పుష్కలంగా ఉండడంతోపాటు నీళ్లు సైతం చాలాచోట్ల పుష్కలంగా లభిస్తుండడంతో ఇక్కడే ఉంటోందా అనే చర్చ జరుగుతోంది.
అటవీ అధికారుల విచిత్ర వైఖరి
పెద్ద పులి సంచారం నేపథ్యంలో అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్న అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉన్నప్పటికీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పులికి సంబంధించిన సమాచారం విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. పైగా పులికి సంబంధించిన సంరక్షణ విషయంలో కచ్చితమైన చర్యలు తీసుకోకుండా, పులి సంచారానికి సంబంధించిన సమాచారం బయటకు ఎలా వెళ్తోందనే విషయంపై శోధన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అటవీ శాఖ వర్గాల్లోనే తీవ్రమైన చర్చ జరుగుతోంది.
దేవక్కపేట్ అటవీప్రాంతంలో ఆవు కళేబరం
కమ్మర్‌పల్లి ఫారెస్ట్ రేంజ్‌లో రెండు ఆవులను చంపిన వ్యాఘ్రం
గోదావరి దాటొచ్చి ఇక్కడే
తిరుగుతోంది..
పులి సంచారంపై అటవీశాఖ గోప్యత!
ప్రజలను అప్రమత్తం చేయడం
మరిచారనే విమర్శలు
జిల్లాలో చక్కర్లు కొడుతున్న పెద్దపులి కమ్మర్‌పల్లి రేంజ్‌లోని దేవక్కపేట అటవీ ప్రాంతంలో రెండు ఆవులను చంపింది. పెద్దపులి సమాచారం విషయంలో గోప్యత పాటిస్తున్న అటవీ అధికారు లు ప్రజలను అప్రమత్తం చేయడంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


