పరీక్షల నిర్వహణలో సీఎస్, డీవోలదే కీలక పాత్ర
డీఐఈవో రవికుమార్
ఖలీల్‌వాడి: ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులదే కీలక పాత్ర అని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఖిల్లాలోని బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇంటర్ బోర్డు కమిషనర్, కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సీఎస్, డీవోలు పరీక్షల నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సీఎస్, డీవోలు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో వెంటనే సీసీ కెమెరాలు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు వెంటనే సమకూర్చాలని ఆదేశించారు. సెల్‌ఫోన్లను పరీక్ష కేంద్రంలో అనుమతించే ప్రసక్తి లేదన్నారు. పరీక్షల నిర్వహణకు ముందే ఇన్విజిలేటర్లతో సమావేశం నిర్వహించి తగిన నియమ నిబంధనలు వివరించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్యాశాఖ, విద్యుత్, ఆర్టీసీ, హెల్త్, పోస్టల్, పోలీస్ అధికారులతో ఇదివరకే సమన్వయ సమావేశం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు ముందు, పరీక్ష జరుగుతున్న సమయంలో, పరీక్ష పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలను పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నుస్రత్ జహాన్, రజీయొద్దీన్ అస్లాం, రజియా సుల్తానా వివరించారు. సమావేశంలో అధికారులు కై సర్ పాషా, చిన్నయ్య, కళాశాల ప్రిన్సిపాల్ ఖాలిక్, సీఎస్, డీవోలు ఉన్నారు.


