గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
నిజామాబాద్ అర్బన్: బాల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న యువకులను, ఏజెంట్లను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పెర్కిట్‌కు చెందిన ఎండీ అంజాద్ అలీ కొన్నేళ్లుగా మహారాష్ట్రలోని కిన్వాట్ నుంచి గంజాయిని తీసుకొస్తూ ఇక్కడ విక్రయాలు చేపడుతున్నాడు. ఇతనిపై వేల్పూర్, ఆర్మూర్, నిజామాబాద్‌లో ఇదివరకే కేసులు నమోదయ్యాయి. నిందితుడు గత ఆరు నెలల నుంచి అతని తమ్ముడు వాహీద్ సుల్తాన్ ఆర్మూర్‌కు చెందిన మోసిన్ సోఫియా, ఓ బాలుడు, బాల్కొండకు చెందిన మనోజ్, గోవిందులు గంజాయి విక్రయించే ఏజెంట్లుగా నియమించుకున్నాడు. మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నాడు. ఒక్కో ప్యాకెట్టు రూ. 400కు విక్రయిస్తున్నాడు. ఏజెంట్లకు రూ.వంద చొప్పున కమీషన్ ఇస్తున్నాడు. శుక్రవారం బాల్కొండలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల పక్కన గంజాయి విక్రయించేందుకు సిద్ధం కాగా పోలీసులు పట్టుకున్నారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంజాద్‌తోపాటుఅతని అనుచరులు, ఏజెంట్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ పేర్కొన్నారు. బాలుడిని సంబంధిత అధికారుల ముందు హాజరు పరుస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి, బాల్కొండ ఎస్సై శైలేందర్, శంకర్, బాల్కొండ పీఎస్ కానిస్టేబుల్ భరత్, నవీన్‌ను సీపీ అభినందించారు.


