అమ్మభాషతో మనో వికాసం
● అద్భుతాలు చూపించే అవకాశం మాతృభాషలోనే..
● నేడు అంతర్జాతీయ
మాతృభాషా దినోత్సవం
నిజామాబాద్ రూరల్: భాషలు ఎన్నున్నా.. భావం వ్యక్తీకరించగలిగేది మాతృభాష ఒక్కటే. అందుకే ఎవరూ నేర్పకున్న ఎవరూ చెప్పకున్నా పుట్టిన ప్రతి శిశువు పలికే తొలిమాట ‘అమ్మ’. పుట్టిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో పట్టుదల, శ్రమ లేకుండా సహజంగా నేర్చుకునేది ఇది ఒక్కటే. శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మన తెలుగు భాషను వర్ణిస్తూ ఎంతో మంది కవులు ఎన్నో గొప్ప మాటలు చెప్పారు. తేనె కన్న తీయనిది.. పాల మీగడ కన్న కమ్మనైనది ఇది మానసిక వికాసానికి సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుంది. మాతృభాషపై మమకారం లేనివారు పరభాషలపై పట్టు సాధించలేరంటూ అధ్యయం చేసి మరీ నిరూపించారు భాషావేత్తలు. అంతటి గొప్పతనం ఉన్న మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాతృభాష సేవలో తరిస్తున్న వారెందరో ఉన్నారు. ముందు తరాల వారికి మాతృభాష తీయదనాన్ని పంచే క్రతువులో వీరు కర్తలుగా ఉన్నారు.
మాతృభాషలోనే పుట్టి, పెరిగివారు ఆ భాషను చిన్నచూపు చూస్తున్నారు. మనిషికి వచ్చే ఏ ఆలోచనైనా మాతృభాషలోనే సమర్థవంతంగా అభివ్యక్తం చేయబడుతుంది. కుటుంబ, సమాజ సంబంధాలు అన్నీ తెలుగుభాషలోనే జీవించగల్గుతాయి. అభివృద్ధి చెందిన ఏ దేశాలైన, ప్రాంతాలైనా తమతమ మాతృభాషను కాపాడుకుంటున్నాయి. విలువలతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మాతృభాషా వినియోగంతోనే సాధ్యమవుతుంది.
– డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు, తెలుగు ఉపాధ్యాయులు, సిర్పూర్
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మాతృభాష ప్రేమికులు మరోసారి భాషా విప్లవానికి పునరంకితం కావాల్సి ఉంది. ఎంతో ప్రాచీనత, అంతకుమించి సౌష్టవం కలిగిన మన తెలుగు భాష అంతరిస్తున్న మాతృభాషల బాటలో ఉండడం విచారకరం. తెలుగు భాషను రక్షించుకుందాం. తెలుగు భాషకు ఆత్మ సమానమైన సొగసులు అందించే తెలంగాణ పదజాల యుతమైన తెలుగును ముందు తరాలకు ప్రేమగా అందిద్దాం. అప్పుడే ఈ దినోత్సవానికి సార్థకత.
– ఘనపురం దేవేందర్, తెలుగు ఉపాధ్యాయులు, సారంగపూర్
అమ్మభాషతో మనో వికాసం
అమ్మభాషతో మనో వికాసం


