ఇకపై యాప్‌లోనే యూరియా
డొంకేశ్వర్(ఆర్మూర్): యూరియా కొనుగోలు చేసే రైతులకు ప్రభుత్వం ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని తప్పనిసరి చే సింది. ఇక మీదట మొబైల్ యాప్ ద్వారానే యూరియాను పొందాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.రైతులకు బుకింగ్ పద్ధతిలోనే యూ రియా ఇవ్వాలని జిల్లాలోని సొసైటీలకు, డీలర్లకు వ్యవసాయాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో పాత పద్ధతికి స్వస్తి చెప్పి, యాప్‌లో యూరియా బుక్ చేసుకున్న వారికే బస్తాలను ఇచ్చారు. మిగతా వారికి యూరియా ఇవ్వలేదు. దీంతో మొబైల్ యాప్‌ను అలవాటు చేసుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా బుక్ చేయాలో తెలిసిన వారిని అడిగి తెలుసుకుంటున్నారు.యూరియా పంపిణీలో పారదర్శకత, సులభతరం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 19వ తేదీ నుంచి యూరియా బుకింగ్ యాప్‌ను అమల్లోకి తెచ్చింది. అదే నెల చివరి వారంలో సాంకేతిక కారణాలతో రెండుసార్లు యాప్ నిలిచిపోయింది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న రైతులు ఆందోళన చెందారు. పంటలకు యూరియా అందకపోతే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అధికారులు పాత పద్ధతిలోనే యూరియాను అందించారు. సుమారు 40 రోజులపాటు సొసైటీలు, డీలర్ల వద్దకు వెళ్లి కావాల్సినన్ని బస్తాలు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తేవడంతో రైతులకు అలవాటు చేసుకోవడం కొంచెం కష్టంగా మారింది. కానీ, ఇదే పద్ధతి సరైందని అధికారులతోపాటు కొంతమంది రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి ఎన్ని బస్తాలు అవసరమో అన్ని మాత్రమే తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని, పక్కదారి పట్టకుండా కట్టడి చేసినట్లుగా ఉంటుందని అంటున్నారు.
కౌలు రైతుల గగ్గోలు
ఆన్‌లైన్ విధానాన్ని
మళ్లీ అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
పాత పద్ధతి ఉండదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
యాప్‌ను అలవాటు చేసుకోవాలని రైతులకు విన్నపం
రెంజల్(బోధన్): ఫెర్టిలైజర్ యాప్‌లో యూరియాను బుకింగ్ చేసుకున్న కౌలు రైతులకు ఓటీపీ చిక్కులు మొదలయ్యాయి. బుకింగ్ సమయంలో ఒకసారి, యూరియా తీసుకునే సమయంలో మరోసారి ఓటీపీ వస్తుండటంతో భూ యజమానులు కొందరు స్పందించటం లేదు. పలుమార్లు ఓటీపీ చెప్పడంతో సైబర్ మోసగాళ్ల బారినపడతామని భావిస్తున్నారు. దీంతో కౌలు రైతులు ఇబ్బందిపడుతున్నారు. రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన రైతులు జగదీశ్, నాని, గంగరాజు యూరియా బుకింగ్ చేసుకొని డీలర్ వద్దకు వెళ్లగా అక్కడ ఆధార్‌నంబరుతోపాటు ఓటీపీ చెప్పాలనటంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయమై ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సిద్దిరామేశ్వర్‌ను వివరణ కోరగా ఫార్మర్ ఐడీ చేసుకున్న రైతులు కాకుండా బంధువులు, మిగతా ఎవరైనా వెళితే ఆధార్ నంబరుతోపాటు ఓటీపీని అందించాల్సి ఉంటుందని తెలిపారు.
యాప్ ద్వారా సులభంగా..
ఇక నుంచి యూరియా పంపిణీ బుకింగ్ యాప్ ద్వారానే నిర్వహించడం జరుగుతుంది. రైతులకు సమయానికి ఎరువులు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తెచ్చింది. రైతులంతా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలి. – మధుసూదన్,
మండల వ్యవసాయాధికారి, డొంకేశ్వర్


