సీఎం బాటలోనే పీీసీసీ చీఫ్ అబద్ధాలు
● ఇద్దరూ దొందూ దొందే..
● బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
● భీమ్‌గల్‌లో జోరుగా
మున్సిపల్ ఎన్నికల ప్రచారం
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): సీఎం రేవంత్‌రెడ్డి బాటలోనే పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ అబద్దాలు ఆడుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తులం బంగారం, స్కూటీలు ఇస్తామంటూ గతంలో రేవంత్ రెడ్డి ఎలా అబద్ధాలు చెప్పారో, ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్ కూడా అవే అబద్దాలు చెబుతున్నారన్నారు. ఇద్దరూ దొందూ దొందేనని ధ్వజమెత్తారు. భీమ్‌గల్‌లో సోమవారం ఆయన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమ్‌గల్‌లో అభివృద్ధి పనులు ఆగిపోయినప్పుడు రాని మంత్రులు, బడా నేతలు ఇప్పుడే ఎందుకు వస్తున్నారు. ఎన్నికలు వచ్చినయి కాబట్టే మంత్రి ఉత్తమ్‌కుమార్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లతో పాటు కార్పొరేషన్ చైర్మన్‌లు వస్తున్నారని ధ్వజమెత్తారు. భీమ్‌గల్‌లో బీఆర్‌ఎస్ గెలుస్తోందని సర్వే రిపోర్ట్ రావడంతోనే కాంగ్రెస్ పెద్దలకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ఇక్కడ హామీలు కురిపిస్తున్నారన్నారు. బడా భీమ్‌గల్ బ్రిడ్జి రూ. 3 కోట్లతో రిపేర్ అవుతుంది. అది కూలిపోయి ఆరు నెలలైనా ఒక్క రూపాయి తేలేదన్నారు. తాను ఒత్తిడి చేస్తే మట్టి పోశారని తెలిపారు. రూ.3కోట్లు తేలేని పీసీసీ చీఫ్ రూ.360 కోట్లతో రింగ్ రోడ్ వేస్తామంటే నమ్మాలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అంటేనే ప్రజల మనిషి, అవసరమైతే మీ ముఖ్యమంత్రి చేత కూడా పనులు చేయిస్తానన్నారు. భీమ్‌గల్ ‘నా బిడ్డ లాంటిది, కంటికి రెప్పలా కాపాడుకుంటా’నన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. ‘ఒకసారి నమ్మితే మోసం చేసినవాడిది తప్పు.. రెండోసారి కూడా నమ్మితే నమ్మినవాడిదే తప్పు అవుతుంది‘ అని పేర్కొంటూ, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో భీమ్‌గల్‌లో ఒక్క పైసా పని కూడా జరగలేదని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.


