రూ. 15వేల కోసం గొడవ.. హత్య
పిట్లం(జుక్కల్): కూలీ డబ్బుల విషయంలో ఇద్దరు కూలిల మధ్య జరిగిన వాగ్వాదమే ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. పిట్లం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఈ నెల 6న ఓ వ్యక్తి హత్యకు గురికాగా ఈ కేసును 48 గంటల్లో పిట్లం పోలీసులు ఛేదించారు. హత్య కేసు వివరాలను డీఎస్పీ విఠల్‌రెడ్డి బాన్సువాడలోని తన కార్యాలయంలో వెల్లడించారు. పిట్లం మండల కేంద్రానికి చెందిన కోట సిద్ధులు అనే వ్యక్తి జాతీయ రహదారి పక్కన నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ నెల 6న సాయంత్రం కొత్త ఇంటికి వచ్చిన సిద్ధులుకు ఇంటి పెయింటింగ్ పనుల కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజేశ్(46) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. హత్య కేసును ఛేదించేందుకు ఎస్సీ రాజేశ్‌చంద్ర రెండు బృందాలను ఏర్పాటు చేశారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై వెంకట్‌రావు ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేయగా వారు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం పిట్లం గ్రామంలోని శాంతినగర్ కాలనీలో ఓ వ్యక్తి కిరాయి ఉన్న ఇంటికి వచ్చి ఇంటి వస్తువులను సర్దుకొని పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు బృందాలు సీసీ కెమెరాల ద్వారా గమనించాయి. అనుమానంతో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా నిందితుడు శ్రీకృష్ణ రాజేశ్‌ను హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. యూపీ కి చెందిన మృతుడు రాజేశ్, శ్రీకృష్ణ గతంలో బెంగళూరులో కలిసి పనిచేసేవారు. రాజేశ్ మిత్రుడు దిలీ ప్ పిట్లం గ్రామంలో పెయింటింగ్ పనులు ఉన్నా యని చెప్పడంతో వీరు ఇటీవల పిట్లంకు వచ్చారు. శ్రీకృష్ణతో దిలీప్ పెయింటింగ్ పనులు చేయించుకొని రూ. 15వేల నగదు ఇవ్వకుండా దిలీప్ గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో రాజేశ్‌తో శ్రీకృష్ణ తరచూ గొడవపడేవాడు. ఈ నెల 6న సిద్ధులు నిర్మాణం చేపడుతున్న ఇంటికి రాజేశ్‌ను శ్రీకృష్ణ తీసుకొచ్చి డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహంతో అతని తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు. మృతుడు రాజేశ్ జేబులో ఉన్న ఫోన్, రూ. 250 నగదు తీసుకొని పరారైనట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కర్ర, ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును తక్కువ సమయంలో ఛేదించి నిందితుడిని పట్టుకున్న సీఐ బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై వెంకట్‌రావు, కానిస్టేబుళ్లు కే రఘు, సాయాగౌడ్, వెంకటేశ్, నవీన్, హోమ్‌గార్డు సంగమేశ్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు.
చంపింది తోటి కూలే..
48 గంటల్లో హత్య కేసును
ఛేదించిన పోలీసులు
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి
గుర్తింపు, అరెస్టు


