ఎరుపెక్కిన ఇస్రోజివాడి
● లోకేటి చందర్‌కు కన్నీటి వీడ్కోలు
● అంత్యక్రియలకు భారీగా
తరలివచ్చిన ప్రజలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ లోకేటి చందర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఇస్రోజివాడి గ్రామంలో ఆదివారం జరిగాయి. ఈ నెల 6న జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఆయన మృతి చెందగా, శవాన్ని ఆదివారం ఉదయం గ్రామానికి తీసుకువచ్చారు. స్వామికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో ఖాళీ జాగాలోనే టెంటు వేసి ప్రజల సందర్శనార్థం ఉంచారు. గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చి నివాళులర్పించారు. ఆయనతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా నక్సలైట్ ఉద్యమంలో కీలకనేతగా స్వామి బాన్సువాడ, ఎల్లారెడ్డి, సిర్నాపల్లి, కామారెడ్డి ఏరియాలతోపాటు సిరిసిల్లా ఏరియాలోనూ సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయనతో కలిసి పనిచేసిన వందలాది మంది మాజీలు ఆఖరి చూపు కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. విప్లవోద్యమంలోనే కన్నుమూసిన స్వామి భార్య సులోచన అమరత్వంపై ప్రచురించిన ‘గెరిల్లా అమ్మ’ అనే పుస్తకాన్ని స్వామి కొడుకు రమేశ్‌తోపాటు బంధువులతో కలిసి అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సులోచన త్యాగాన్ని సైతం కొనియాడారు. పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు పలువురు స్వామి ఎదిగిన తీరును వివరించారు.
ఎర్రజెండాల రెపరెపలు...
స్వామి అంతిమయాత్రలో వందలాది మంది ఎర్రజెండాలు చేతబట్టుకొని పాల్గొన్నారు. దీంతో దారి మొత్తం ఎరుపెక్కింది. పాటలు పాడుతూ, నినదిస్తూ స్వామిని స్మరించుకున్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని నినదించారు. కాగా, స్వామి అంత్యక్రియల సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టిలో ఉండి పరిశీలించారు.
చేను దగ్గర ఖననం
స్వామి కుటుంబానికి చెందిన చేను దగ్గర ఖననం చేశారు. కొడుకు రమేశ్ చేతుల మీదుగా అంతిమక్రియలు నిర్వహించారు. ఉద్యమంలో ఉన్నపుడు తల్లి అంత్యక్రియలు నిర్వహించిన రమేశ్, ఇటీవలే ఉద్యమం నుంచి వైదొలిగి లొంగిపోయాడు. ఇదే సమయంలో చనిపోయిన తండ్రి అంత్యక్రియలు కూడా ఆయన చేతుల మీదుగా జరిగాయి. అంత్యక్రియల్లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఽఅధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మన్, కార్యదర్శి నారాయణరావ్, విరసం అధ్యక్షుడు పాణి, కార్యదర్శి రాజయ్య, అమరుల బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు పద్మకుమారి, శాంతక్క, వివిధ సంఘాల నేతలు కుమారస్వామి, విజయరామరాజు, సుదర్శన్, భవానీ, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర, న్యాయవాదులు క్యాతం సిద్దరాములు, ఆజాద్, విద్యార్థి నేతలు విఠల్, సురేశ్, మాజీ మావోయిస్టు నేతలు అమర్, సునీత, నరేశ్, రామకృష్ణ, జనార్దన్ తదితరులు హాజరయ్యారు.
ఎరుపెక్కిన ఇస్రోజివాడి


