క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Feb 9 2026 8:09 AM | Updated on Feb 9 2026 8:09 AM

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌

చెరువులోపడి యువకుడి మృతి రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

రుద్రూర్‌: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన పొతంగల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సునీల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్‌ మండలం కొడిచర్ల గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్‌(35) కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 6న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం పొతంగల్‌ చెరువులో మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబీకులకు సమాచారం అందించారు. చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

అనుమానాస్పదస్థితిలో యువకుడు..

బాన్సువాడ రూరల్‌: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎస్‌హెచ్‌వో తుల శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండల కేంద్రంలోని డబుల్‌బెడ్‌ రూం కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్‌(37) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో అతని భార్య ఎంతలేపినా నిద్రలేవకపోవడంతో ఆమె శివకుమార్‌ తండ్రికి ఫోన్‌ చేసి చెప్పింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

చికిత్స పొందుతూ విద్యార్థిని..

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని మల్లుపేట్‌ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్‌ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌ మండలం కొప్పర్లకు చెందిన గడిపె గోపాల్‌రావు కుమార్తె లక్ష్మి(14) రెంజల్‌ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు కుమార్తె లక్ష్మిని రాయించేందుకు గోపాల్‌రావు తన భార్యతో కలిసి కామారెడ్డికి బైక్‌పై వచ్చారు. తిరుగు ప్రయాణంలో మల్లుపేట్‌ క్రాస్‌ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొన్నది. బైక్‌పై ఉన్న వీరు కింద పడడంతో లక్ష్మి తలకు బలమైన గాయమైంది. స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రుద్రూర్‌: పొతంగల్‌ మండలంలోని జల్లాపల్లి శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీపీ, పొతంగల్‌ కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్‌కు తీవ్ర గాయలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం బోధన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement