భీమ్‌గల్ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
● మాజీ మంత్రి మహమూద్ అలీ
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మున్సిపల్ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని రాష్ట్ర మాజీ హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గం, ముఖ్యంగా భీమ్‌గల్ ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని కొనియాడారు. ప్రశాంత్ రెడ్డి నాయకత్వం నియోజకవర్గానికి గర్వకారణమన్నారు. ప్రశాంత్ రెడ్డి కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడని అన్నారు.
కాంగ్రెస్ వి అన్నీ అబద్ధపు హామీలే!
కాంగ్రెస్ పార్టీ గతంలో 42 ఏళ్ల పాటు పాలించినా మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిందని అలీ విమర్శించారు. కేవలం రెండేళ్లలోనే కేసీఆర్ 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి 1లక్ష,40వేల మంది పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని, ప్రజలను మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు. భీమ్‌గల్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 12 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అభివద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు నవీద్ ఇక్బాల్, మొయిజ్ బాయ్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


