‘బీసీలను నిలువునా ముంచిన కాంగ్రెస్’
సుభాష్‌నగర్: బీసీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం వారి ఓట్లను వాడుకుని నిలువునా మోసం చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ఆదివారం నగరంలోని 7వ డివిజన్ అభ్యర్థి నిమ్మల శ్రావణ్ కుమార్, 14వ డివిజన్ అభ్యర్థి రంజిత్, 15వ డివిజన్ అభ్యర్థి శేఖర్‌కు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్‌పాల్ మాట్లాడుతూ.. బీసీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేని అసమర్థుడని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పూర్తిగా మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఐదేళ్లలో బీసీల అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి.. రెండున్నరేళ్లలో కనీసం రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. 12 ఏళ్లుగా దేశాన్ని ప్రధాని మోదీ, 7 ఏళ్లుగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంపీ అర్వింద్, రెండున్నరేళ్లుగా తాను అర్బన్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పని చేస్తున్నామని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ధన్‌పాల్ సూర్యనారాయణ ఓటర్లను కోరారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


