క్రైం కార్నర్
● కార్యదర్శి వేధింపులే కారణమని మృతుడి భార్య ఫిర్యాదు
● కేసు నమోదు చేసిన పోలీసులు
బోధన్‌టౌన్(బోధన్): గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ నీరడి బాబు(38) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోధన్ మండలం పెంటాఖుర్దు గ్రామంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన నీరడి బాబు పెంటాఖుర్దు గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5న ఉదయం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా గమనించిన కుటుంబసభ్యులు బోధన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పంచాయతీ కార్యదర్శి వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని బాబు భార్య నీరడి కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేసినప్పటికీ లెక్కల్లో తేడాలున్నాయని అందరిముందు అవమానించాడని, దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మద్యానికి బానిసై ఒకరు ..
బాన్సువాడ: పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. సంగమేశ్వర కాలనీకి చెందిన టాక్ సందీప్(24) మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవించే వాడు. రోజూ మద్యం తాగి ఇంట్లో అనవసరంగా గొడవ పడేవాడు. శుక్రవారం ఇంట్లో ఊరేసుకునేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు సముదాయించారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ మరొకరు..
బీబీపేట: అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించిన ఒకరు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. సీతారాంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర గోపాల్ (35) అప్పులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తితో ఈ నెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారకస్థితిలో ఉన్న గోపాల్‌ను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


