బల్దియా బరిలో ఉన్నత విద్యావంతులు
● రాజకీయాల్లో మార్పు
రావాలంటూ పోటీకి సిద్ధం
● ఆర్మూర్‌లో అందరి దృష్టి
ఆకర్షిస్తున్న అభ్యర్థులు
ఆర్మూర్ : సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పలువురు విద్యావంతులు ఎన్నికల బరిలోకి దిగారు. ఆర్మూర్ పట్టణంలోని ఆయా వార్డుల నుంచి ఎండీ జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫాం డీ), ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ, బీఎడ్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు పోటీలో నిలిచారు. ఉన్నత చదువులు.. వృత్తుల్లో ఉన్నప్పటికీ రాజకీయవారసత్వం, రిజర్వేషన్ కలిసి రావడం తదితర కారణాలు.. ప్రజలకు ఏమైనా చేయాలనే సంకల్పం వారిని రాజకీయాల వైపు మరల్చాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా ప్రజా సేవకే అంకితం అవుతామంటున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
● పట్టణంలోని 23వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న గుర్రం అభిలాష్ ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మోర్తాడ్ మాజీ ఎంపీపీ అయిన తన తండ్రి బొంబాయి నర్సయ్య రాజకీయ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని అభిలాష్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు.
● 19వ వార్డుకు చెందిన దియా అగర్వాల్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదివారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
● 36వ వార్డుకు చెందిన దోండి రోమరాయ్ ఎంబీఏ, బీఎడ్, ఎంఏ వంటి ఉన్నత చదువులు చదివి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్‌గా, ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సమాజానికి తన వంతుగా ఎంతో కొంత చేయాలనే సంకల్పంతో రాజకీయాలోకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
● 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఖాందేశ్ సంగీత భర్త ప్రోత్సాహంతో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ఆర్మూర్ కోర్టులో న్యాయవాద పని చేస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు కౌన్సిలర్‌గా గె లుపొందిన సంగీత నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచారు.
● 16వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బోచ్కర్ సవిత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు.


