వైద్యసిబ్బందికి హెపటైటిస్ బి టీకాలు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): వైద్యసిబ్బంది హెపటైటిస్ బి వ్యాధికి గురికాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు ఇస్తున్నట్లు డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యసిబ్బందికి హెపటైటిస్ బి టీకాల పంపిణీని డీఎంహెచ్‌వో మోపాల్ మండలంలోని ముదక్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రారంభించారు. పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యాధికారులు, నర్సింగ్ అధికారులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు, నాల్గోతరగతి సిబ్బందికి టీకాలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 739 మందిని గుర్తించామని, వీరిలో మొదటిరోజు 647 మంది సిబ్బందికి టీకాలు ఇచ్చామన్నారు. మిగతా వారికి త్వరలోనే ఇస్తామన్నారు. రెండో మోతాదును 28 రోజుల తర్వాత ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా టీకాల అధికారి డాక్టర్ అశోక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మల్, డాక్టర్ అలేఖ్య, సీహెచ్‌ఓ భూలక్ష్మి, పర్యవేక్షణ అధికారులు మధుకర్, రవీందర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


