సమరశీల పోరాటాలతోనే తిప్పికొడదాం
● టీయూసీఐ రౌండ్ టేబుల్
సమావేశంలో వక్తలు
ఆర్మూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రమజీవుల వ్యతిరేక విధానాలను సమరశీల పోరాటాలతోనే తిప్పికొడదాంమని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కాంగ్రెస్ కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్‌లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కార్మిక, రైతు సంఘాలు, ఎస్‌కేఎం జాతీయ కమిటీ ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అమెరికాకు దాసోహం అంటూ భారత దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆరోపించారు. అదానీ, అంబానీల ప్రయోజనాల కోసం కార్మిక, కర్శకుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కా ర్మికులకు 8 గంటల పనిదినాన్ని ఒక్క కలం పోటుతో రద్దు చేసి 12 గంటలకు పెంచడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్రలు తెలుస్తున్నాయన్నారు. 12న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవారం, సీఐటీయూ మండల కార్యదర్శి ఎల్లయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్ ఇన్‌చార్జీ అవిష్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రమేశ్ ప్రసంగించారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు, పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


