సేంద్రియ పసుపు రైతులకు ప్రోత్సాహకం
సుభాష్‌నగర్: సేంద్రియ పద్ధతిలో పసుపు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.16వేల ప్రోత్సాహకం అందించే ఆలోచన చేస్తున్నట్లు ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పసుపును జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అర్వింద్ ధర్మపురి కాసేపు జర్నలిస్టుగా మారి పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డిని ఇంటర్వ్యూ చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటుతో ఫలితం దక్కిందా? అని ఎంపీ ప్రశ్నించగా.. పసుపు బోర్డు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, పంటకు మంచి ధర రావాలంటే మార్కెట్ ముఖ్యమన్నారు. దీని కోసం ఎగుమతులు, ప్రమోషన్లపై కార్యక్రమాలు చేపట్టిన ట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పసుపు క్వింటాలుకు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతుందన్నారు. నిజామాబాద్‌లో ధర రాకపోవడంపై తాను వ్యాపారులు, అధికారులతో మాట్లాడగా.. రైతులు పచ్చి పసుపు తెస్తున్నట్లు తన దృష్టికి తీసుకొచ్చారని గంగారెడ్డి తెలిపారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ఏం చేస్తున్నారని ఎంపీ ప్రశ్నించగా.. బోర్డు ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఉందని, కొత్త వంగడాలు వచ్చిన రైతులు ఎర్రగుంట అనే పసుపు రకాన్ని మాత్రమే సాగు చేస్తున్నారని చైర్మన్ తెలి పారు. రాష్ట్రంలోని పలు గ్రామాలను ఎంపిక చేసి పసుపు సాగు విధానాలపై, ఏ రకమైన వైరెటీ సాగు చేయాలో అవగాహన కల్పించామని వివరించారు.
పసుపు రైతులకు ఏమైనా సబ్సిడీలు అందిస్తున్నారా అని అర్వింద్ ప్రశ్నించగా.. ఎఫ్‌పీఓలకు 90శాతం సబ్సిడీపై, రైతులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం రాయితీపై బాయిలర్లు, పాలిషింగ్ మిషన్లు అందిస్తున్నట్లు గంగారెడ్డి వివరించారు. పసుపు తవ్వకాల మిషన్ కోసం పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. పసుపు బోర్డు ద్వారా ఎగుమతుల లైసెన్స్ ఇప్పిస్తామన్నారు. ఈయూతో వాణిజ్య ఒప్పందంతో పసుపు సహా ఇతర సుగంధ ద్రవ్యాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. యూరోపియన్ దేశాల్లో ఆర్గానిక్ పసుపునకు డిమాండ్ ఉందని తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, వ్యాపారులు, పసుపు రైతులు పాల్గొన్నారు.


