ఆర్మూర్‌లో వార్ వన్ సైడేనా?
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసి అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించగా, ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కోసం జరిగే వార్ వన్‌సైడే ఉండనుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏబీ శ్రీదేవి శ్రీనివాస్(చిన్న) నామినేషన్ వేస్తే టీపీసీసీ అధికార ప్రతినిధి హోదాలో ఆయనకు కాంగ్రెస్‌లో ఉన్న పరిచయాలతో చైర్‌పర్సన్ పీఠం తమ వరకు రాదని భావించిన ఆశావహులు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ తరఫున మొదటి నుంచి తెరపై ఉన్న మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్లు కశ్యప్ స్వాతిసింగ్ బబ్లూ, పండిత్ వినీత పవన్, కాంగ్రెస్ నాయకులు మెడిదల సంగీత రవిగౌడ్, బీజేపీ నాయకులు గాండ్ల కంచెట్టి లక్ష్మి గంగాధర్ బరిలో నుంచి తప్పుకున్నారు. మరోవైపు చిన్నతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి ఉన్న సత్సంబంధాల కారణంగా ఏబీ శ్రీదేవి(చిన్న) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన 17వ వార్డులో బీజేపీ అభ్యర్థిని పోటీలో నిలపకపోవడంతో నాయకుల మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందానికి నిదర్శనమని ప్రచారం జరుగుతోంది. పట్టణంలోని 36 వార్డుల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే 1, 14, 17, 20, 22, 28వ వార్డుల్లో సైతం బీజేపీ అభ్యర్థులను బరిలో ఉంచింది. 1వ వార్డు నుంచి ముస్లిం మైనార్టీకి చెందిన అర్షియా ఫర్హీన్‌కు టికెట్ కేటాయించారు. అయితే, బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఏబీ శ్రీదేవి(చిన్న)కు వ్యతిరేకంగా మాత్రం పోటీకి అభ్యర్థిని నిలపకపోవడంపై చర్చ జరుగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం బీఆర్‌ఎస్‌కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఆదరణ లభించడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అందులో ఏబీ శ్రీదేవి(చిన్న)కు వన్ సైడ్ కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కీలకమైన 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏబీ శ్రీదేవి(చిన్న), బీఆర్‌ఎస్ అభ్యర్థి బేగం రహతున్నీసా మధ్యనే పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి ని పోటీ నుంచి ఉపసంహరింపజేయడానికి ప్రయత్నాలు చేయగా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అడ్డుకున్నట్లు తెలిసింది.
ఏబీ శ్రీదేవి(చిన్న) నామినేషన్‌తో
పోటీ నుంచి తప్పుకున్న ఆశావహులు
శ్రీదేవికి పోటీగా అభ్యర్థిని
నిలబెట్టని బీజేపీ
లోపాయకారి ఒప్పందాలే శ్రీదేవిని
చైర్‌పర్సన్ పీఠానికి దగ్గర చేస్తున్న వైనం!
ఆర్మూర్‌లో వార్ వన్ సైడేనా?


