బీఆర్‌ఎస్ హయాంలోనే నగరాభివృద్ధి
● మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
నిజామాబాద్ అర్బన్: బీఆర్‌ఎస్ హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూరు ఆడబిడ్డల కోసం ఐటీ హబ్ నిర్మించి, విదేశాలకు వెళ్లి 25 కంపెనీలు తీసుకువచ్చామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రూ.2 వేల పింఛన్, కల్యాణలక్ష్మి తదితర పథకాలు అమలు చేసి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నగరమంతా పచ్చదనంలా తయారు చేశామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత తమదేనన్నారు. నూతన శ్మశాన వాటికలు, మినీ ట్యాంక్‌బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నూతన కలెక్టరేట్, మున్సిపల్ భవనాన్ని నిర్మించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఎక్కడుందో చూపించాలని ప్రశ్నించారు. నగర ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల కోసం ఊరు పేరు మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నగరంలో మార్కండేయ గుడి, సాయిబాబా ఆలయాలను కట్టించిన ఘనత తమదేనన్నారు. అబద్ధపు మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో 36, 37, 38, 43,9, 10 డివిజన్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు వెంకట్, విజయలక్ష్మి, రాజేశ్, వెంకటరమణ, సోనీ ఆకాష్, మక్కల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


