దిమ్మ తిరిగే దిగుబడి!
● ఎకరానికి 10 ట్రాక్టర్ల పసుపు
● డొంకేశ్వర్ యువరైతు
కళ్లెం మహిపాల్‌రెడ్డి ఘనత
డొంకేశ్వర్(ఆర్మూర్): పసుపు సాగు చేస్తున్న డొంకేశ్వర్ రైతులు అద్భుత దిగుబడులు సాధిస్తున్నారు. యువతరైతు కళ్లెం మహిపాల్‌రెడ్డి వ్యవసాయక్షేత్రంలో ఎకరానికి ఏకంగా 10 ట్రాక్టర్లకు పైగా (35క్వింటాళ్లు) దిగుబడి రావడంతో తోటి రైతులు ఆశ్చర్యపోతున్నారు. మహిపాల్‌రెడ్డి గత కొన్నేళ్లుగా పసు పు సాగు చేస్తున్నారు. నేల స్వభావమో, సేంద్రియ ఎరువుల వాడకమో లేదా చేతి గుణమో తెలియదు కానీ.. ఊహించని విధంగా దిగుబడులు తీస్తున్నాడు. మహిపాల్‌రెడ్డి ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పసుపు సాగుచేశాడు. ఎకరానికి పది ట్రాక్టర్ల చొప్పున మొత్తం అరవై ట్రాక్టర్ల వరకు పంట చేతికి వచ్చింది. క్వింటాళ్ల లెక్కన చూస్తే ఎకరానికి సాధారణంగా అందరికి 25 నుంచి 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా మహిపాల్ మాత్రం 36 క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధించడం గొప్ప విషయం. పశువులు, గొర్ల ఎరువు ఉపయోగించడంతోపాటు బెడ్ విధానంలో డ్రిప్ ద్వారా పసుపు సాగు చేశానని మహిపాల్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పండిన పసుపును ఉడికించి డబుల్ పాలిష్ చేసి ఎప్పటిలాగే సాంగ్లీ మార్కెట్‌లో విక్రయిస్తానని అన్నారు.


