యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఆర్మూర్ టౌన్: యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎలాంటి సందర్భంలోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగకూడదన్నారు. ఈవ్‌టీజింగ్, మహిళలను వేధించడం సరికాదని, ఎవరైనా మహిళలను వేధిస్తే షీ టీంకు సమాచారం అందించాలన్నారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఆధార్ కార్డు, సరైన వివరాలు ఉంటేనే ఇళ్లను అద్దెకు ఇవ్వాలన్నారు. అంతకుముందు 120 ఇళ్లలో తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లభించని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్మూర్, రూరల్ సీఐలు సత్యనారా యణ, జాన్ రెడ్డి, ఆర్మూర్ డివిజన్‌లోని తొమ్మిది మంది ఎస్సైలు, ఏఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


