‘ఇందూరు’పై బీజేపీ జెండా ఎగురవేస్తాం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
సుభాష్‌నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా ఐక్యంగా పని చేస్తే ఇందూరుపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయ మని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అధ్యక్షతన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రెండేళ్లుగా తాను నగరాభివృద్ధికి సుమారు రూ.130 కోట్లు నిధులు తీసుకొచ్చానని వెల్లడించారు. ఇటీవల కాలంలో టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా ప్రతి డివిజన్‌కు రూ.కోటీ చొప్పన నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని, డివిజన్లలో సమగ్రంగా అభివృద్ధి పనులు జరగనున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి రూ.23 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఇందూరులో నిర్వహించిన అన్ని సర్వేలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మన ఇందూరు.. మన మేయర్ నినాదాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. నేటి నుంచి తనతోపాటు ఎంపీ అర్వింద్, జిల్లా, రాష్ట్ర నాయకులు, పదాధికారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నక్క రాజేశ్వర్, బద్దం కిషన్ తదితరులు పాల్గొన్నారు.


