ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తీర్మానం
మోపాల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి 2005 ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలని తాడెం గ్రామసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం తాడెం సర్పంచ్ కూచన్‌పల్లి జలంధర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజలు పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ కోరారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో గ్రామసభలో చర్చించిన సమస్యలు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసుకుందామని పేర్కొన్నారు. అలాగే ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ప్రవేశపెట్టిన ఉపాధి కూలీలకు నష్టదాయకమైన జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని ప్రతిపాదించగా, సభలో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో ఉపసర్పంచ్ కంజర్ కిరణ్, పంచాయతీ కార్యదర్శి మృదుల, కారొబార్ అరుణ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు అంగలి సుజాత, తిరుపతి, లక్క గంగారాం, బియ్య రవి తదితరులు పాల్గొన్నారు.


