అందుబాటులో యూరియా నిల్వలు
● రైతులు ఎలాంటి ఆందోళనకు
గురి కావొద్దు
● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి భరోసా కల్పించారు. సోమవారం ఆయన మండలాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని సహకార సంఘాలలో యూరియా సహా ఇతర ఎరువులు అందుబాటులో ఉంచామని, పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకు అందేవిధంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లాలో 82,055 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అవసరం ఉండగా, 51,091 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు 38,993 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామన్నారు.
మరో 12,097 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువు 32,057 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1580 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1460 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు.
పంపిణీ కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేస్తూ, ఉదయం 6.00 గంటల నుంచే పంపిణీ ప్రారంభం అయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పారదర్శకంగా యూరియా ఎరువుల పంపిణీకి రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తెచ్చిందని, రైతు సోదరులు, డీలర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే విషయంలో ఇబ్బంది తలెత్తకుండా వ్యవసాయ, సహకార శాఖలతో పాటు ఇతర శాఖల సిబ్బందిని పంపిణీ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతామని అన్నారు. అదేవిధంగా ప్రతి యూరియా విక్రయ కేంద్రంలో యూరియా బుకింగ్ యాప్‌కు సంబంధించిన క్యూ.ఆర్ కోడ్‌ను స్పష్టంగా ప్రదర్శిస్తారని తెలిపారు. తద్వారా రైతులు సులభంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే ఒకేసారి యూరియా కొనుగోలు చేయకుండా, శాసీ్త్రయ పద్ధతిలో అవసరానికి సరిపడా మాత్రమే వినియోగించాలని కలెక్టర్ రైతులను కోరారు. యూరియా పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


